పార్టీ నుంచి దగ్గుబాటిని తప్పించనున్నారా..?

by CNN TELUGU
0 comment

రామనాథం బాబు తిరిగి పాత గూటికి చేరడంతో ప్రకాశం జిల్లాలో రాజకీయం ఎవరు ఊహించని విధంగా ఆసక్తి రేపుతోంది. దగ్గుబాటిని తప్పించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక రామనాథం బాబు తనంతట తాను పార్టీలోకి చేరారా అనేది చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో కీలకమైన నియోజకవర్గం, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంఛార్జ్‌గా ఉన్న పర్చూరులో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చిందనే చర్చ మొదలయ్యింది. రామనాథం బాబు పార్టీలో చేరికపై నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న దగ్గుబాటి వర్గానికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే చేరిక కార్యక్రమానికి ఆ వర్గం నుంచి ఎవరూ హాజరు కాకపోవడం ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకు రావడంపై పార్టీలో సర్వత్ర చర్చ జరుగుతోంది.

ఏకంగా జగన్ సమక్షంలోనే రామనాథం బాబు పార్టీ కండువా కప్పుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వ్యూహం వెనుక కారణమేంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై అంత ఫోకస్ పెట్టలేదని చర్చ జరుగుతోంది. వెంకటేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో ఉన్నా ఆయన సతీమణి పురందేశ్వరి మాత్రం బీజేపీలో ఉన్నారు.

అంతేకాదు కొద్దిరోజులుగా ఆమె జగన్ సర్కార్‌పై విమర్శలు చేయటం, మరికొన్ని కొన్ని సందర్భాల్లో ఎదురు దాడికి దిగారు. ఇటు దగ్గుబాటి కూడా నియోజకవర్గంలో కేడర్, పార్టీ కార్యక్రమాలపైనా అంతగా దృష్టి పెట్టడం లేదట. ఈ పరిణామాలపై జిల్లా నేతలు జగన్‌తో చర్చించారట. వీటన్నంటిని బేరీజు వేసుకొని రామనాథం బాబును మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. రామనాథం బాబు వైఎస్సార్‌సీపీ గూటికి వెళ్లడం టి.డి.పి. వర్గాలలో ఆసక్తిగా మారింది. ఈ చేరిక వెనుక బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చక్రం తిప్పారని ప్రకాశం జిల్లాలో చర్చ నడుస్తోంది.

Related Posts