నేడు జగన్‌, నాడు వైఎస్

by CNN TELUGU
0 comment


నాడు ఆరోగ్య శ్రీ – నేడు కంటి వెలుగు..
ఇది పేద ప్రజలకు మరో సంజీవని..
ఏపీ సీఎం జగన్ పై రోజా ప్రశంసలు.
.

సీఎం వైఎస్‌ జగన్‌ మానవత్వం ఉన్న నాయకుడని, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆలోచన చేసి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొస్తే.. నేడు జగన్ మరో అడుగు ముందుకేసి కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల జల్లు కురిపించారు.

గురువారం నగరిలోని జూనియర్ కాలేజీలో వైఎస్సార్ కంటి వెలుగును ప్రారంభించిన అనంతరం రోజా.. మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం వైఎస్సార్‌ కంటివెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని, ఈ పథకం అద్భుతం అంటూ.. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటే.. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్‌ మరో అడుగు ముందుకు వేసి వైఎస్సార్‌ కంటివెలుగు పథకాన్ని ప్రారంభిచారన్నారు. రాష్ట్రంలో ఎవరికీ కంటి సంబంధిత సమస్యలు రాకుండా చూసేందుకు ముఖ్యమంత్రి జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇది పేద ప్రజలకు మరో సంజీవని వంటిదని, ఈ కంటి వెలుగును రాష్ట్రవ్యాప్తంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని రోజా కోరారు.

ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా.. అనంతపురంలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 6 దశల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల చేతుల మీదుగా ఈ కంటి వెలుగు పథకం ప్రారంభమయ్యింది.

Related Posts