కన్నా పదవికే ఎసరు పెట్టారు.. అందుకే ఇలా..

by CNN TELUGU
0 comment

అమరావతి : బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను తొలగించాలని సుజనా, సీఎం రమేష్ వంటివారు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. బీజేపీలో చేరిన కొంతమంది టీడీపీ నాయకులు బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యనించారు. కన్నా తన పదవిని కాపాడుకోవడానికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

శనివారం తాడేపల్లి కార్యాలయంలో ఆయన మీడయాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మీద విమర్శలు చేసే ముందు ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు. టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలనే కన్నా చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ ఎంత విచ్చలవిడిగా జరిగిందో కన్నాకు తెలియదా అని మల్లాది ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసి బీజేపీ నేతలు చేసిన విమర్శలు.. రోజూ చంద్రబాబు చేసే విమర్శలేనన్నారు. టీడీపీ విధానాలను బీజేపీ నేతలు అమలు చేస్తున్నారా.. అని విష్ణు నిలదీసారు. టీడీపీ క్రిమినల్స్‌ పార్టీ అని సదావర్తి భూములను కాజేస్తే కన్నా ఏమి చేశారని ప్రశ్నించారు. టీడీపీని.. టీడీపీ నాయకులే భ్రష్టు పట్టించారన్నారు. దుర్గమ్మ సన్నిధిలో క్షుద్రపూజలు చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు.

దళిత ఎమ్మెల్యేను టీడీపీ నేతలు దూషిస్తే నోరు ఎందుకు మెదపలేదో కన్నా సమాధానం చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడు ఒక ఐపీఎస్‌ అధికారిపై నోరు పారేసుకొంటే ఎందుకు మాట్లాడలేదని దళిత ఎస్‌ఐపై టీడీపీ నేతలు కులం పేరుతో అవమానిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని మల్లాది ప్రశ్నించారు. వైస్సార్‌సీపీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అర్హత కన్నాకు లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతుల కోసం రైతు భరోసా వంటి పథకాలు తీసుకోస్తే కన్నా ఎందుకు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. బీజేపీ విమర్శలు టీడీపీకి జిరాక్స్ లా ఉన్నాయని విష్ణు ఎద్దేవా చేశారు. దేవాలయ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని కన్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు. పేదల ఇళ్ల కోసం దేవాలయ భూములను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు బీజేపీ నేతల విమర్శల పైన ఆచితూచి వ్యవహరిస్తున్న వైసీపీ ఇక  ప్రత్యక్ష యుద్దం ప్రకటించటానికి నిర్ణయించింది. కేంద్రంలో ముఖ్యులుతో ఉన్న సత్సంబంధాల కారణంగా సంయమనం పాటించామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా మరియు టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలు సైతం వైసీపీ ప్రభుత్వం పైనా అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ పైనా పదేపదే విమర్శలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఇది సాగుతున్నా వైసీపీ నేతలు స్పందించ లేదు. అయితే ఇప్పుడు గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వం మీద విమర్శలు చేయటంతో ఇక వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. బీజేపీ విమర్శలు టీడీపీకి జిరాక్స్ లా ఉన్నాయని వైసీపీ నేతలు మండిడుతున్నారు.

ఐతే వైసీపీ నుండి బీజేపీ ఇంత తీవ్రస్థాయిలో విమర్శలు ఎదర్కోవటం ఇదే ప్రథమం. ఇక మాటల యుద్దం తప్పేటట్లు లేదు.Related Posts