ఎంపీ రఘురామ అరెస్టుకు ఇదా సమయం..? పవన్ కళ్యాణ్ ఆగ్రహం..

by CNN TELUGU
0 comment

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసి ఉండగా.. ఎంపీ రఘురామ కృష్ణరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని జనసేన భావిస్తోందన్నారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.


‘‘ప్రభుత్వాన్ని తరుచూ తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం, సందర్భం లేకుండా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక పక్క కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం పది షాపులు తిరగవలసిన క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టిపెట్టాలి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికంగా జనసేన భావిస్తోంది.

ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళుతున్న అంబులెన్స్‌లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే గానీ అంబులెన్స్‌లు కదిలే పరిస్థితి రాలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ను ఏదో అద్భుతాలు సృష్టించి ఆపమని జనసేన కోరడం లేదు. వైద్యపరంగా అక్కడున్న వనరులు, వైద్య సిబ్బంది, ఇతరత్ర అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి విపత్కర సమయంలో సొంత పార్టీ ఎంపీనీ అరెస్టు చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు.

Related Posts

Leave a Comment