అవినీతి లేని పాలన అందించడమే లక్ష్యం

by CNN TELUGU
0 comment


అమరావతి : ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏ-వన్ కన్వెన్షన్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చేతుల మీదుగా అర్హత సాధించిన అభ్యర్థులు నియామక పత్రాలను అందుకున్నారు.

ఉద్యోగాల కల్పనలో సరికొత్త రికార్డ్ సాధించామన్నారు సీఎం జగన్. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని వాటిలోదాదాపు లక్షన్నరమందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు తేవాలని ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగుల భుజాలపై పెడుతున్నానని దీనిని ప్రతి ఒక్కరూ ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని, తన నమ్మకాన్ని ఎవరూ వమ్ము చేయొద్దని జగన్ కోరారు.

నిజాయితీగా, లంచాలు లేని, పారదర్శక పాలన అందజేయాలని వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలన్నారు. అవినీతి లేని పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు వెంటిలేటర్‌పై గ్రామ పాలన వ్యవస్థ ఉందని కులం, మతం, పార్టీలు చూడొద్దని స్వచ్ఛమైన పాలన అందించేందుకే సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేశామన్నారు జగన్. సచివాలయ వ్యవస్థలో 500కుపైగా సేవలు 34 శాఖలకు చెందిన పనులు జరుగుతాయన్నారు. గ్రామ సచివాలయంలో 72 గంటల్లోనే సమస్య పరిష్కారమవుతుందని ప్రతి గ్రామ వాలంటీర్‌కు స్మార్ట్ ఫోన్ అందజేస్తామని చెప్పారు.

డిసెంబర్ నాటికి సచివాలయంలో అన్ని వసతులు ఏర్పాటు చేసి జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. జనవరి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్య శ్రీ కార్డులు అందజేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అందించే బాధ్యత గ్రామ, సచివాలయ ఉద్యోగులదేనని రాజకీయాలకు అతీతంగా అర్హులకు సేవ అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.

Related Posts