డ్రైవర్‌గా మారిన తహసీల్దార్

by CNN TELUGU
0 comment

కరోనా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కరోనాకి జిల్లాల భేదం లేదు, ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా ప్రజలపై పంజా విసురుతోంది. ముఖ్యంగా కరోనాతో ఇబ్బంది పడుతూ ఇంటి దగ్దరే చికిత్స తీసుకుంటున్నవారి పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ఆస్పత్రుల్లో చేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు కరోనా సోకిన వారిని తీసుకెళ్లేందుకు వాహనాలు ముందుకు రావడం లేదు. దీంతో చాలాచోట్ల హోం ఐసోలేషన్ లో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి అందడం లేదని తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో హోం ఐసోలేషన్ లో ఉన్నవారు. తమ పరిస్థితి ఏంటో తెలియక ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్నారు. అలా కష్టాల్లో ఉన్న వారిని చూసిన కొందరు మేమున్నామంటూ ముందకొస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు..

శ్రీకాకుళం జిల్లా సోంపేట తహసీల్దార్ చేసిన ఓ పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఆయన చేసిన పని ఎంతోమందికి స్ఫూర్తి నింపుతోంది. సోంపేటలోని ఎస్పీ వీధిలో ఒకరి పరిస్థితి విషమంగా మారటంతో రోగి కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నం చేశారు. అయితే కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. ఊపిరి అందకపోవడంతో భయపడ్డ కుటుంబసభ్యులు ఏం చేయాలో తెలియక వెంటనే ఈ విషయాన్ని తహసీల్దార్‌కు తెలియజేశారు.

తహసీల్దార్ కు ఫోన్ వచ్చిన వెంటనే ఆయన దగ్గర్లో ఉన్న వాహనాల కోసం ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఉద్దానం ఫౌండేషన్‌ అంబులెన్స్‌ వినియోగించేందుకు నిర్ణయించారు. అయితే ఆ అంబులెన్స్ డ్రైవర్‌ కుటుంబసభ్యుల పరిస్థితి బాగోలేకపోవడంతో విధులకు హాజరు కాలేదు. ఇతర డ్రైవర్లను సహాయం కోరిన భయంతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తహసీల్దానే సాహసం చేసి, ఆ వ్యక్తిని బతికించాలనే తాపత్రయంతో సోంపేట తహసీల్దార్‌ ఎస్‌.గురుప్రసాద్‌ కొంతసేపు అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారారు. స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ అంబులెన్స్‌ని ఎస్సీ వీధికి తీసుకెళ్లి బాధితుడిని తీసుకొచ్చేందుకు బయల్దేరారు. అయితే కొంతదూరం వెళ్లిన తరువాత గమనించిన స్థానిక వాలంటీర్‌ శ్రీకాంత్‌ గతంలో అంబులెన్స్ నడిపి అనుభవం ఉండడంతో డ్రైవింగ్‌ చేసేందుకు ముందుకు వచ్చారు.

దీంతో వెంటనే శ్రీకాంత్ కు పీపీఈ కిట్‌ సమకూర్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఓ బాధితుడిని ఆసుపత్రికి చేర్చేందుకు సహకరించిన వాలంటీర్‌ శ్రీకాంత్‌ను, స్థానిక తహసీల్దార్‌ గురు ప్రసాద్ ను అధికారులు అభినందించారు.

Related Posts

Leave a Comment