ప్రజలకోసం యాచనకైనా సిద్దం..

by CNN TELUGU
0 comment
  • ప్రజలకోసం యాచనకైనా సిద్దం..
  • కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి.
  • టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు పెడుతున్నారు.
  • కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాడతా..

టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గురువారం విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఓడిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని అటువంటి వారికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులను పరిష్కరించేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేసులు ఎదుర్కొంటున్న వారు న్యాయవాదులను పెట్టుకుని సరైన సమయంలో స్పందించాలన్నారు. ఈ కేసులను ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చైనా సరే అండగా ఉంటామన్నారు. అవసరమైతే భిక్షాటన చేసైనా కార్యకార్తలను కాపాడుకుంటానని చంద్రబాబు ఆవేశంగా చెప్పారు.

ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అత్యుత్సాహంతో వ్యవహరించొద్దని హితవు పలికారు. జగన్, విజయసాయి రెడ్డికి సహకరించిన అధికారులు గతంలో జైలు పాలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు అక్రమ కేసులు పెడితే తర్వాత కాలంలో ముద్దాయిలుగా మిగిలిపోవాల్సి వస్తుందని బాబు హెచ్చరించారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకోవాలని చూస్తే అదే ఉరితాడై వారినే చుట్టుకుంటుందని పోలీసులకు చంద్రబాబు హితవుపలికారు.

Related Posts