అమరావతి,నవంబర్, 4 : ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవారికి అందరూ వారిలాగే కనిపిస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ను ఉద్దేశించి విమర్శించారు.
సోమవారం పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగపూర్ కన్సార్టియంను వెనక్కు పంపించారని, మొత్తం వాతావరణాన్ని చెడగొట్టి.. ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూల్చారని ఆయన ఆరోపించారు.
ఆనాడు దోమలపైన యుద్ధం చేసారని ఎగతాళి చేసారు. ఇప్పుడు డెంగీ వచ్చిన వారు చనిపోతున్నారని, దానికి ఎవరు కారణమని ఆయన ప్రశ్నించారు. విషజ్వరాలతో డాక్టర్లు చనిపోయారని, దానికి కారణం వైసీపీ ప్రభుత్వం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, ఈ ప్రభుత్వం రైతుకు రూ. 12,500 ఇస్తామని, తర్వాత మాట మార్చిందని చంద్రబాబు విమర్శించారు. అన్ని వర్గాలలో, రైతులలో కులవివక్ష తీసుకొస్తోందన్నారు.
గ్రామ సచివాలయాల పరీక్షలో ప్రథమ ర్యాంకు వచ్చిన అమ్మాయే ప్రశ్నాపత్రం తయారు చేసిందన్నారు. పంచాయితీ కార్యాలయాలపై జాతీయపతాకం రంగులను తీసేసి వైసీపీ పార్టీ కలర్లు వేసుకుంటోందన్నారు. టీడీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.