నీ ‘కథ’ నాకు తెలుసు.. ఈటల తీవ్ర హెచ్చరికలు..!

by CNN TELUGU
0 comment

మంత్రి గంగుల కమలాకర్ కు ఈటల రాజేందర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బిడ్డా గంగులా.. అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకో.. 2023 తర్వాత నీవు ఉండవని అని హెచ్చరికతో కూడిన జోస్యం చెప్పారు.

మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న తర్వాత సభ్యత, సంస్కారం ఉండాలని, హుజూరాబాద్ ప్రజలను నువ్వు వేధిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. పైరవీలు చేసుకుని మంత్రి అయిన చరిత్ర నీదని, నీలాంటి చరిత్ర నాది కాదని అన్నారు.

నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు..? అని ఈటల అన్నారు. నీ కథ మొత్తం తనకు తెలుసని… సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని… తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని, జిల్లాను బొందలగడ్డగా మార్చావని ఈటల దుయ్యబట్టారు. నీలాంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని ఈటల చెప్పారు. తాను ఎంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నానని.. లేకపోతే మాడిమసైపోతారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఏఒక్కరోజైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

2006 ఎన్నికల్లో దివంగత రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ఎందరో నేతలను కొన్నా.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్నే గెలిపించారని ఈటల పేర్కొన్నారు. ఇప్పుడు కూడా హుజూరాబాద్ లో అదే జరుగుతుందని ఆయన వివరించారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వస్తే… 54 వేల ఓట్ల మెజారిటీతో హుజూరాబాద్ ప్రజలు ఆదుకున్నారని అన్నారు. తన ప్రజల మీద ఈగ కూడా వాలనివ్వనని, హుజూరాబాద్ ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని ఈటల వివరించారు.

Related Posts

Leave a Comment