ఆమె కూడా ఇంతపని చేస్తుందా..!

by CNN TELUGU
0 comment

ఈజీ మనీ కోసం ఫేస్‌బుక్‌లో కొందరి అశ్లీల మార్ఫింగ్ చిత్రాలను పోస్ట్ చేసి ఓ యువతి పోలీసులు అడ్డంగా దొరికిపొయింది.

పోలీసులు కధనం ప్రకారం.. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌కి చెందిన ఫాతిమా(21) ఉద్యోగ వేటలో ఉంది. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో కొన్ని స్కూల్స్‌కు లోగోలు, కరపత్రాలు రూపొందిస్తూ డబ్బులు సంపాదిస్తోంది. అయితే ఎన్నాళ్లని చాలీ చాలని సంపాదన అనుకుందో.. ఏమో గానీ.. ఈజీ మనీ కోసం పెద్ద స్కెచ్ వేసింది.

తాను లోగోలు, కరపత్రాలు రూపొందించిన స్కూల్స్ ఫేస్‌బుక్ ఖాతాలను టార్గెట్ చేసింది. ఆయా ఫేస్‌బుక్ ఖాతాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోటోలను డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్ చేసింది. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చి తిరిగి అవే ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఆపై తెలివిగా ఆ స్కూల్ యాజమాన్యాలకు ఫోన్ చేసి తానో ఐటీ నిపుణురాలినని, మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పింది. అయితే ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పింది. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఫేస్‌బుక్ పేజీ నిండా ఇలాంటివే కనిపిస్తాయని బెదిరించేది.

ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుని కొంతమంది డబ్బులు సమర్పించుకున్నారు. అయితే ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి ఫాతిమా ఇంటిని తనిఖీ చేయగా ఇంట్లో ఉన్న కంప్యూటర్ నుంచే సదరు యువతి మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Posts