కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సిఎం వైఎస్‌ జగన్‌

by CNN TELUGU
0 comment

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పటిష్టం చేయడంతో పాటు 108, 104 సర్వీసులను సమర్థవంతంగా నడిచేట్టు చేస్తానని వైద్య, ఆరోగ్య రంగాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను 2022 జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో ఆధునీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్యకళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

అనంతపురంలోని జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌ లో ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్బంగా వైయస్సార్‌ కంటివెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ దృష్టి దినోత్సవం.. మన కళ్ళు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయి. కంటి విలువ ఎలాంటిది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ.. పుట్టగానే అమ్మ ఎలా వుంటుందని ఆ పుట్టిన బిడ్డకు పరిచయం చేసేది ఈ కళ్ళే.. అటువంటి కళ్ళకు సంబంధించి ఈ రోజు మన రాష్ట్రంలో వున్న పరిస్థితి ఏమిటీ.. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరికీ కలగాలి. మన రాష్ట్ర జనాభా అయిదు కోట్ల నలబై లక్షల మందిలో 2.12 కోట్ల మందికి దృష్టి పరంగా సమస్యలు వున్నాయి. ఈ సమస్యల్లో దాదాపు ఎనభై శాతం వరకు మనం కాస్త ధ్యాస పెడితే… కంటిచూపునకు సంబంధించి ఆపరేషన్లు, చికిత్స చేయించుకుంటే.. పూర్తిగానయం అవుతాయన్నారు.

మన రాప్ట్రంలో కంటి శుక్లాలు, చిన్నపాటి చికిత్సతో నయం చేసే సమస్యలను గత ప్రభుత్వాలు ఎప్పూడూ కూడా పట్టించుకోలేదు. ఈ దృష్టి సమస్యలకు సంబంధించి ఏ రోజు మేం ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పలేదు. అయినప్పటికీ రాఫ్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి సమస్యలను పరిష్కరించాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కంటిచూపు పరీక్షలు, చికిత్సలు చేయడానికి అక్షరాలా అయిదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గ్లోకోమా, రెటినోపతి, డయాబేటిక్ వంటి అనేక సమస్యలు, పలు శస్త్రచికిత్సలను ఉచితంగా చేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మూడు సంవత్సరాల్లో.. ఆరుదశల్లో.. ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.

ప్రతి ఇంటిలోనూ వెలుగు నింపాలని, ప్రతి కంటిలో వెలుగు వుండాలనే లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతున్నాము. అక్షరాలా 5.4 కోట్ల మందికి ఒకేసారి ఈ కంటిపరీక్షలు, చికిత్సలు నిర్వహించడం అన్నది సాధ్యం కాదన్నవిషయం అందరికీ తెలిసిందే. అందుకే దీనిని దశల వారీగా చేపడుతున్నాం. మొదటి, రెండో దశల్లో కేవలం పిల్లలకు పూర్తిగా పరీక్షలు చేయడం, చికిత్సలు చేయడం జరుగుతుంది. మొదటి దశ కార్యక్రమం అక్టోబర్‌ 10 తేదీ నుంచి 16 తేదీ వరకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 62,489 పాఠశాలల్లో అంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న మొత్తం 70,41,988 పిల్లలకు ఈ కార్యక్రమంలో ఉచితంగా కంటి పరీక్షలు, కళ్ళజోళ్ళు, చికిత్సలు చేయిస్తాం. మొదటి దశ కింద ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూల్ లోనూ అమలు చేస్తాం. ఆశావర్కర్లు, టీచర్లు, ఎఎన్‌ఎంలు, విద్యాశాఖ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమంను ముందుకు తీసుకువెడతాం. విద్యార్ధులకు ప్రాథమిక పరీక్షలు చేయిస్తాం.

ఆ తరువాత ఎవరికైనా రెండోదశ పరీక్షలు చేయించాల్సిన అవసరం వుందని నిర్దారణ అయితే… రెండో దశ కార్యక్రమం నవంబర్‌ ఒకటో తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు జరుగుతుంది. ఎవరికి అయితే చికిత్స అవసరం వుంటుందో వారికి రెండో దశలో మరోసారి పరీక్షలు చేయిస్తారు. విజన్‌ సెంటర్లలో ఈ పరీక్షలు చేయించిన తరువాత వారికి డిసెంబర్‌ 31వ తేదీ నాటికి చికిత్స, కళ్లజోళ్లు అందచేస్తాం. మొదటి రెండు దశల్లో బడి పిల్లలకు పూర్తయిన తరువాత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సాధారణ ప్రజలకు జరిపే కంటిపరీక్షలు, చికిత్సలను ఆరుదశల్లో చేస్తాం.

ఒక్కో దశ ఆరునెలల పాటు జరుగుతుంది. ఒక్కో దశలో పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అవ్వా, తాతలను కూడా కవర్ చేసే కార్యక్రమం చేపడతాం. ఫిబ్రవరి 1 నుంచి 2022 జనవరి 31 తేదీ నాటికి ప్రతి ఆరు నెలలకు ఒక దశ చొప్పున రాష్ట్ర ప్రజలకు పరీక్షలు, చికిత్సలు చేయిస్తాం. అవసరం మేరకు కంటి అద్దాలను కూడా అందిస్తాం. మూడు నుంచి ఆరు దశల్లో మొత్తం ప్రజలను ఈ పరీక్షలు, చికిత్సలు చేయించే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నాం.
దీనిలో గ్రామవాలంటీర్లు, ఆశావర్కర్లు, ఎఎన్‌ఎం, పిహెచ్‌సి సిబ్బంది, మెడికల్‌ సిబ్బంది, స్వచ్చంద సంస్థలను ప్రభుత్వం భాగస్వాములను చేస్తోంది. ఈ పథకం గురించి పదిమందికి చెప్పండి… ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు కంటి పరీక్షలు చేయించండి.. మీరు కూడా చేయించుకోండి.. మీ ఇళ్లలో.. మీ కళ్లలో కాంతులు నింపడానికి.. కేవలం నాలుగు నెలల కిందట అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతూ ముందడుగులు వేస్తోందని జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో 108 వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. మామూలుగా అయితే ఫోన్‌ కొడితే… కుయ్‌…కుయ్‌…కుయ్‌… అంటూ ఇరవై నిమిషాల్లో అంబులెన్స్‌ మన వద్దకు వచ్చి.. బాగోలేని వారిని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయి.. ఉచితంగా వైద్యం చేయించి, చిరునవ్వులతో ఇంటికి పంపించాలి. అటువంటి ఈ వ్యవస్థను గత అయిదేళ్లలో పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చబోతున్నాను. 676 మండలాల్లో 432 అన్ని సదుపాయాలతో కూడిన కొత్త 108 వాహనాలను కొనుగోలు చేస్తున్నాము.
676 మండలాలకు గానూ ప్రతి మండలానికి ఒక కొత్త 104 వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. ఈ రెండు పథకాలకు కలిపితే దాదాపుగా పదకొండు వందల పైచిలుకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేశాం.
ఇవ్వన్నీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి.

పలాస, మార్కాపురంలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వున్నారు. ఇప్పటి వరకు వీరి సమస్యలను ఎవ్వరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అటువంటి చోట్ల పరిష్కారం కోసం వెతుకుతున్నాం. ఈ రెండు చోట్ల కిడ్నీ వ్యాధుల పరిశోదన కేంద్రాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో సర్ఫేస్‌ వాటర్‌ ద్వారానే నీళ్లను పంపిణీ చేస్తాం.

మార్కాపురం, పిడుగురాళ్ల, ఏలూరు, పులివెందుల, మచిలీపట్నం, పాడేరు, విజయనగరంలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఏలూరు కాలేజీకి శంకుస్థాపన చేశాం. డిసెంబర్‌ 21వ తేదీన రాష్ట్రంలోని అందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. ఈ కార్డుల్లో వారి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన డేటాను నమోదు చేస్తాం.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలతో కూడిన డేటాను ఈ ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరుస్తాం. ఈ కార్డు పట్టుకుని ఏ ఆసుపత్రికి వెళ్లినా.. వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి, బ్లడ్‌ గ్రూప్‌ తదితర వివరాలు వెంటనే తెలిసిపోతాయి. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్యంను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తాం. ఇది జరగాలి అంటే.. మన దగ్గర వున్న ఆసుపత్రుల్లో పనితీరును పూర్తిగా మెరుగుపరచాలి. మన ఆసుపత్రుల్లోని పరిస్థితులను మార్చాలి. వీటన్నింటికి శ్రీకారం చట్టబోతున్నాం. డెంగ్యూ, మలేరియా వంటి వాటితో కలిపి మొత్తం 1200 వ్యాదులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నాం. జనవరి ఒకటో తేదీ దీనికి శ్రీకారం చుడుతున్నాం.

జనవరి 1 తేదీన రెండువేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ పశ్చిమ గోదావరిజిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నాం. మూడు నెలల పాటు ఆ పైలెట్‌ ప్రాజెక్ట్ ను పరిశీలించిన తరువాత ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రతి నెలా ఒక జిల్లాలో రెండు వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. చికిత్స అందిస్తాం. రాష్ట్రం వెలుపల కూడా ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు దక్కేలా చర్యలు.నవంబర్‌ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై లోని 150 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎంపిక చేసి, వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబోతున్నామని జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు.

Related Posts