ఆయుర్వేద మందు పై చురుగ్గా పరిశోధనలు

by CNN TELUGU
0 comment

కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

అమరావతి, మే 21 : కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర ఆయూష్ అధికారులు కూడా పరిశోధనలు జరుపుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కృష్ణపట్నంలోని ఆయుర్వేద మందు శాస్త్రీయతపై రాష్ట్ర స్థాయి అధికారులను పూర్తి వివరాలు అందజేయాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రానికి చెందిన ఆయుర్వేద డాక్టర్లు కొద్ది రోజుల కిందట కృష్ణపట్నం వెళ్లి అక్కడి వారితో మాట్లాడడమే కాకుండా ఆయుర్వేద మందును హైదరాబాద్ లోని ల్యాబ్ లో పరీక్షలు కూడా చేశారన్నారు. ఈ పరిశోధనలో నష్టకలిగించే వివరాలు తెలియరాలేదన్నారు. ప్రజల నమ్ముతున్నా… సైంటిఫిక్ గా తెలియాల్సి ఉందన్నారు.

రాష్ట్ర ఆయూష్ కమిషనర్, కొందరు టెక్నికల్ అధికారులు ప్రస్తుతం కృష్ణపట్నం గ్రామంలోనే ఉన్నారని, మందును వినియోగించిన కరోనా బాధితులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని రాష్ట్ర అధికారులకు శనివారం స్థానిక తయారీదారులు వివరించనున్నారన్నారు. దీనిద్వారా ఆయుర్వేద మందుపై ఒక అవగాహన కలుగుతుందన్నారు. దేశ మంతా తెలియడంతో కేంద్ర ఆయుర్వేద అధికారులు కూడా ఆయుర్వేద మందు గురించి ఆరా తీస్తున్నారన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను కూడా కేంద్ర ఆయుర్వేద అధికారులతో మాట్లాడానన్నారు. విజయవాడలో ఉన్న ఐసీఎంఆర్ రీజనల్ బ్రాంచ్ కు చెందిన కొందరు అధికారులు కృష్ణపట్నం గ్రామానికి సోమవారం వెళతారన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించనున్నారన్నారు. ఆయుర్వేద మందుపై రిపోర్టు ఇవ్వనున్నారన్నారు. ఇందుకు కొద్ది రోజులు సమయపడుతోందని, ఆ తరవాతే ఆయుర్వేద మందు ఫలితాలపై అవగాహన వస్తుందని ఆయన వెల్లడించారు.

45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు ముందుగా వేస్తామని, తరవాతే 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందేనన్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మందులు కొనుగోలుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. శనివారం జరిగే కొనుగోలు కమిటీ సమావేశంలో డీఆర్డీఏ మందుల కొనుగోలుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Related Posts

Leave a Comment