బోటు ప‍్రమాదంపై వైఎస్‌ జగన్‌ సీరియస్‌

by CNN TELUGU
0 comment

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

అమరావతి, సెప్టెంబరు,15 : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం జగన్‌… యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మరోసారి అధికారులతో మాట్లాడారు. సహాయక కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈసందర్భంగా అధికారులను ఆదేశించారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణానికి అనుకులమా? కాదా అన్నదానిపై క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సీఎం సూచించారు. లైసెన్సులు పరిశీలించాలని, బోట్లను నడిపేవారు, అందులో పని చేస్తున్న వారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా అనే దానిపై తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బోట్లలో ముందస్తు జాగ్రత్తలు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించాలన్నారు. నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారు చేసి తనకు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. కాగా ఇప్పటి వరకూ అయిదు మృతదేహాలను వెలికి తీశారు.

Related Posts

Leave a Comment