కొత్త మోటార్ చట్టం అమలుకు ‘నో ’ చెప్పిన తెలంగాణ సర్కార్

by CNN TELUGU
0 comment

కొత్త మోటార్ చట్టం అమలుకు ‘నో ’ చెప్పిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్ : కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని అమలుచేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శాసనసభలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
చట్టాలను, ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులు సరిగా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో మోటారు వాహనాల చట్టంలో జరిమానాలను సవరిస్తూ కొత్త చట్టం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో… తప్పులు చేసిన వారికి భారీ జరిమానాలను విధించేలా పలు సవరణలు చేసుకున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న తప్పుకి ఇంత భారీ పెనాల్టీలు కట్టాలా? అంటూ ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తెచ్చిన చట్టంలో జరిమానాలను రాష్ట్రంలో తగ్గించింది. ఆ వెంటనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగారు. ఇంత భారీ జరిమానాలను తాము బెంగాల్లో విధించలేమని, కొత్త మోటారు వాహనాల చట్టాన్ని తాము అమలు చేయబోమని ప్రకటించారు. అయితే, ప్రజలు కేవలం జరిమానాలనే చూస్తున్నారని, ప్రాణాలను గమనించడం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మోటారు వాహనాల చట్టంపై రాష్ట్రాలు వాటి నిర్ణయాన్ని తీసుకోవచ్చని చెప్పారు. ఈ నేపధ్యంలో… తెలంగాణలో కొత్త చట్టాన్ని అమలు చేయబోమని కేసీఆర్ ప్రకటించారు.

Related Posts

Leave a Comment