ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచే.. జగన్ ప్రారంభం..!

by CNN TELUGU
0 comment

అమరావతి : తన తండ్రి వైఎస్ఆర్ ప్రారంభించి అర్థంతరంగా ఆగిపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని జగన్ పున:ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 2 నుంచి సీఎం హోదాలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ తరహాలో రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు.

గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి ఏర్పాటుచేసిన కార్యక్రమమే ఈ రచ్చబండ. గతంలో చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన వైఎస్ ప్రమాదంలో మృతిచెందారు. వాతావరణం అనుకూలించకపోవడంతో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో వైఎస్ కన్నుమూశారు. దీంతో ఆ కార్యక్రమం అక్కడే అలాగే ఆగిపోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2 వైఎస్ జయంతి రోజునే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జగన్ అనుకున్నా కొన్ని పరిస్థితుల వల్ల వాయిదా పడింది. దీంతో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి సీఎం జగన్ మళ్ళి రచ్చబండను ప్రారంభించాలనుకుంటున్నారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలు కూడా సచివాలయానికి పరిమితమయ్యారు. అన్ని శాఖలు, విభాగ అధిపతులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి క్షణం కూడా తీరిక లేకుండా గడిపారు. సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాల్లో పర్యటించడానికి అవసరమైన షెడ్యూల్ ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు సమాచారం అందించి తన పరిపాలన, విధి విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, గ్రామ వాలంటీర్ల పనతీరు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాల్ని సేకరించడంతో పాటు పాలనా విధానాలను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సూచనలు సలహాలు సైతం స్వీకరించడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.

Related Posts