ఉదయ్ రైలును గుంటూరు వరకు పొడిగించాలి

by CNN TELUGU
0 comment

అమరావతి, సెప్టెంబరు,18 : ఈనెల 26 న ప్రారంభం కానున్న విశాఖ – విజయవాడ ఉదయ్ రైలుని గుంటూరు వరకు పొడిగించి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో హాల్ట్ సౌకర్యం కల్పించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అమరావతి రాజధానిగా ఏర్పడినా మంగళగిరి ప్రజలను రైల్వేశాఖ గుర్తించకపోవడం పట్ల స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చేనేత పరిశ్రమకి మంగళగిరి పెట్టింది పేరు. అదేవిధంగా శ్రీ పానకాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కూడా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన మంగళగిరి ప్రాంతానికి రైల్వేశాఖ తగిన ప్రాధాన్యతని ఇవ్వకపోవడాన్ని ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

గత 15 సంవత్సరాలుగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని గుంటూరు వరకు పొడిగించి మంగళగిరిలో హాల్ట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు ఎన్నోసార్లు వినతులు అందజేశారు. ప్రజలకు కావలసిన కనీస సమస్యలను తీర్చడంలో మంగళగిరి ప్రాంత రాజకీయ నాయకులు ముందుకు రావడం లేదని ప్రజలు అంటున్నారు. అమరావతి రాజధానిగా ఏర్పడి ఐదు సంవత్సరాలు దాటిన… తిరుపతి వెళ్లడానికి మంగళగిరి ప్రాంత ప్రజలకు ఒక్క రైలు సౌకర్యం కూడా లేదని తిరుపతి వెళ్లాలంటే ఇక్కడ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన వెలిబుచ్చారు.

ప్రయాణీకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరావు సి.ఎన్.ఎన్. వార్తాసంస్థతో మాట్లాడుతూ… ఎన్నో సాంకేతిక విప్లవాలను ఆవిష్కరిస్తున్న రైల్వేశాఖ తక్షణమే స్పందించి ఉదయ్, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను గుంటూరు వరకు పొడిగించి మంగళగిరిలో హాల్ట్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా తిరుపతికి మంగళగిరి మీదుగా రైళ్లను నడపాలని ఆయన కోరారు. ఈ రైళ్లను పొడిగించటంవల్ల ఉత్తరాంధ్రా ప్రజలకి రాజధాని, మంగళగిరితో పాటు గుంటూరుకి నేరుగా రైలు సౌకర్యం కలుగుతుందని అలాగే చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

ఇకనైనా వీటిపై స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు స్పందించి కృషి చేయాలని అదేవిధంగా రైల్వే అధికారులు మంగళగిరి ప్రజలను మరియు రాజధాని అమరావతిని గుర్తించి రైళ్లను నడపడానికి చర్యలు తీసుకోవాలని నన్నపనేని నాగేశ్వరావు కోరుతున్నారు.

Related Posts

Leave a Comment